Wednesday, April 4, 2012

బిగ్ బజార్ డిస్కౌంట్ కూపన్స్ ఎవరికి లాభం

బిగ్ బజార్లో పాత వస్తువులు అంటే చెప్పులు, బట్టలు, పేపర్లు, ప్లాస్టిక్ వస్తువులు ఇలా ఏదైనా సరే అమ్మితే దానికి బదులుగా కొన్ని కూపన్స్ ఇస్తారు. వాటికి పది రెట్లు విలువైనవి కొంటే మనకు పది శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 18 నుండి ఏప్రిల్ 8 వరకు ఉంటుంది. 



వాళ్ళు పాత వస్తువులకు చాలా ఎక్కువ రేటే ఇస్తారు. ఉదాహరణకు బయట పేపర్లు మన దగ్గర  కిలో 8 రూపాయలకు తీసుకుంటే, బిగ్ బజార్లో మనకు 30 రూపాయల చొప్పున ఇస్తారు. దాంతో చాలామంది బిగ్ బజార్ వైపు ఆకర్షితులవుతున్నారు. అయితే మనం బయట పేపర్లు అమ్మితే మనకు డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కూపన్స్ వాడుకోవాలంటే దానికి దాదాపు పది రెట్లు మనం ఖర్చు పెట్టాలి. 

వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ కూడా కొన్నింటి మీద అంటే షూస్ లాంటి వాటి మీద 25 శాతం ఉంది, కానీ ఫుడ్ బజార్లోనూ, ఎలక్ట్రానిక్ వస్తువుల మీద 10 శాతం మాత్రమే ఉంది. చాలా తక్కువ సమయంలోనే వీటిని వాడుకోవలసి వస్తోంది కనుక జనాలు ఎక్కువ మంది బిగ్ బజార్ కు వస్తున్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే పాత చెప్పులు, పనికిరాని బట్టలు వంటి వాటిని ఎవరూ కొనరు కనుక ఈ ఆఫర్ చాలా లాభమని. అయితే వాళ్ళ షరతులు,వస్తువుల నాణ్యత వంటి విషయాలను గమనిస్తే నిజంగా ఈ కూపన్స్ ప్రజలకు లాభమేనా అనే సందేహం వస్తుంది.

నాకు ఈ మధ్యే వీటి గురించి తెలిసింది.  నేను ఫుడ్ బజార్లో కొన్నింటిని కొని ఇంటికి వెళ్ళినాక చూసుకుంటే వాటిలో కొన్ని బూజు పట్టి ఉన్నాయి. నేను అక్కడ కొనడానికి వచ్చిన కొంత మందిని అడిగినప్పుడు, వాళ్ళు తమ అభిప్రాయాలు రకరకాలుగా చెప్పారు. ఒకతను జీన్స్ కొన్నాడు. అది ఒక మూలగా చినిగి ఉంది. అతను మూడు జీన్స్ ప్యాక్ (చూడటానికి లేనిది) తీసుకొని ఇంటికి వెళ్ళినాక గమనిస్తే ఆ విషయం బయట పడింది.  కొంతమంది ఎలక్ట్రానిక్స్ కొని, అవి పాడైతే, వాటికి గ్యారంటీ లేనందువల్ల మూలన పడేయవలసి వచ్చిందని చెప్పారు. ఇక అక్కడ అమ్మే బూట్లను గమనించండి. సెకండ్ హ్యాండ్ వాటి లాగే ఉంటాయి (అయి ఉండవచ్చు కూడా). కొని మోసపోయిన వాళ్ళు బాధ పడటం తప్ప ఏమీ చేయలేక పోతున్నారు. 

నిజానికి ఇలాంటివి ప్రజల బలహీనతలను తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవటమే తప్ప వేరేది కాదు. దీని వల్ల మామూలు ప్రజలకంటే వ్యాపారస్తులకే లాభం. మీరు ఒకవేళ ఏమైనా కొనాలంటే (ప్రత్యేకించి ప్యాక్ చేసినవి కొనేటప్పుడు) జాగ్రత్తగా పరీక్షించి తీసుకోండి. బాగా లేకపోతే వాపసు చేయండి (నేను అలాగే చేశాను; అఫ్ కోర్స్, దానికి చాలా తతంగం ఉంటుందనుకోండి, అయినా సరే వెనుకాడవద్దు). మీరు డబ్బులిస్తున్నారు, నాణ్యత ఉన్న వాటిని పొందటం మీ హక్కు. దాన్ని ఉపయోగించుకోండి. వ్యాపారస్తుల ప్రకటనల మాయజాలంలో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండండి, మీ చుట్టుప్రక్కల వారిని జాగృతపరచండి.

3 comments:

  1. ఈ ఆర్టికల్ రాసినందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకొంటున్నాను. నేను గత నాలుగు సంవత్సరాలుగా బిగ్ బజార్ వ్యతిరేక పోరాటం చేస్తున్నాను. మొన్న ఒకసారి ఐదు రోజులు ఆఫర్ పెట్టినపుడు కూడా బిగ్ బజార్ వద్ద తిరుమలలో ఉన్నంత క్యూ ఉంది. జనాలకు ఇదంతా ఎందుకు అర్థం కావడం లేదో అని నాకు బాధ వేస్తుంది. ఇంటికొచ్చి పేపర్లు తీసుకెళ్తానంటే సరే అని నేను పేపర్లు ఇచ్చాను. వీలైనంత వరకు జాగ్రత్త పడి ఉప్పు, పప్పు వంటి కొన్ని ఫుడ్ ప్రొడక్స్ట్ మాత్రమే అక్కడ తీసుకున్నాను. నా దృష్టిలో బిగ్ బజార్ ఈ దేశపు అతిపెద్ద దోపిడీ దారు. అత్యంత మోసకారి. అందులో అమ్మేవన్నీ రీసైకిల్డ్, సెకండ్ హ్యాండ్ వస్తువులే.

    ప్రకాష్ చిమ్మల, సీనియర్ సబ్ ఎడిటర్, సాక్షి

    ReplyDelete
  2. నిజమే ప్రకాష్ గారు, సామాన్య ప్రజలకు ఇవన్నీ అర్ధం కావు. కనీసం చదువుకున్నవాళ్లైనా అర్ధం చేసుకుని జాగ్రత్త పడితే ఎంతో మంచిది. ఏదో ఒకరోజు ప్రజలు ఇలాంటి వాటిని తప్పక అర్ధం చేసుకుంటారు. మీరు ప్రజలంకోసం చేస్తున్న పోరాటానికి నా అభినందనలు. మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. బయట 8రూపాయలు వచ్చేదానికి 30రూపాయలు ఇస్తున్నాడంటే ఆలోచించాలండి.అత్యాశ కొంపలకు చేటు.ఇది ఇందా గోవిందా టీవి సీరియల్ లాగుందండీ.ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే మోసం జరుగుతుందని తెలిసిన తేలు కుట్టిన దొంగలా ఉండడం.సీనియర్ సబ్ ఎడిటర్,సాక్షి గారు మీ చేతిలో పదునైన ఆయుదం ఉంది గమనించండి.

    ReplyDelete