Monday, October 31, 2011

ఉట్టి అన్నం తినండోచ్

ఈ రోజు నుండి "కిలో రూపాయికే  బియ్యం" పథకాన్నిగౌరవనీయులైన ముఖ్యమంత్రిగారు ప్రారంభించబోతున్నారు. దీనివల్ల రెండు కోట్ల మందికి  పైగా లబ్ది పొందుతారట. అంటే రాష్ట్ర జనాభాలో దాదాపు నాల్గోవంతు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నం దొరుకుతుందన్నమాట.
ఇమేజ్ 
అయితే అసలు సమస్య ఇక్కడే మొదలవుతోంది. అన్నంలోకి వేసుకోవడానికి ఏదైనా కూర చేసుకుందామంటే ఏ కూరగాయలైనా కిలో ఇరవైకి తక్కువ లేవు. పప్పు సంగతి మర్చిపోవాల్సిందే. ఎందుకంటే కిలో డెబ్భైకి తక్కువ లేదు. ఇక పచ్చడి చేసుకోవాలంటే దానికి నూనె, చింతపండు లాంటివి కావాలి. వాటి ధరలు కూడా మండిపోతున్నాయి. పోనీ మజ్జిగన్నా పోసుకుందామంటే పాలు లీటరు 32 రూపాయలు.  ప్రభుత్వం సరఫరా చేసే విజయ పాలు వాడదామంటే  అవి కూడా ఇవాల్టి నుండి రెండు రూపాయలు పెరిగి లీటరు 30 రూపాయలకి చేరుకున్నాయి. కనీసం గంజి చేసుకుని మిరపకాయ కొరుక్కోవాలంటే మిరపకాయల ధర కిలో ఇరవై రూపాయల పైమాటే. అందుకనే ఉత్త అన్నం తినటం బెటర్. 

పాపం ప్రభుత్వంవారు ఎంతో దయతో కిలో బియ్యాన్ని రూపాయకే ఇస్తున్నారు. ఎందుకంటే పెరిగిన  ద్రవ్యోల్బణాన్ని అరికట్టలేరు.  ధరలను అదుపు చేయలేరు. నిత్యావసరాలు లగ్జరీలుగా మారిపోయాయి. మరి వాటిని సామాన్యులకు అందుబాటులోకి తేవాలంటే ఎంతో కష్టమాయే. అందుకనే ఎవరూ నోరెత్తకుండా ఇలాంటి అస్త్రాలు ప్రయోగిస్తుంటారు. నిజంగా ఈ పథకం వల్ల లభ్ది పొందేదెవరో, సామాన్యులకు దీని వల్ల ఎంత ఉపయోగమో ఏలినవారికే తెలియాలి. 

No comments:

Post a Comment