మార్చ్ 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ముందుగా మహిళలందరికీ నా శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదలై దాదాపు శతాబ్దం అయినప్పటికీ (మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1913 లో రష్యాలో జరిగింది) ఇంకా మహిళల స్థితిగతుల్లో చాలా మార్పు రావలసి ఉంది.
ఇమేజ్
ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి గ్రామీణ మహిళల సాధికారం - పేదరికం, ఆకలి నిర్మూలన లక్ష్యంగా పెట్టుకుంది. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా లింగ వివక్ష కొనసాగుతూనే ఉంది. మహిళలకు చెల్లించే వేతనాలు తక్కువగానే ఉన్నాయి. ఈ మహిళా దినోత్సవానికి యూరోపియన్ పార్లమెంట్ సమానమైన పని చేసినప్పుడు స్త్రీ, పురుషులిరువురికీ సమాన వేతనాలు చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంకా లైంగిక వేధింపులు, గృహ హింస, స్త్రీ ని తక్కువగా చూడటం ఇప్పటికీ చాలా సమాజాల్లో కనిపిస్తూనే ఉంది.
ఇక మన దేశంలో ఇప్పటికీ గర్భస్థ శిశువు ఆడపిల్ల అయితే అబార్షన్ చేయించుకుంటున్నారు. ఒకవేళ పుట్టినా ఎక్కువ మంది పుట్టిన పిల్లని పురిటిలో చంపెయటమో, లేక రోడ్డు మీద పారేసి పోవటమో చేస్తున్నారని మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాము. ఇంకా గ్రామాల్లో చాలా మంది ఆడపిల్లలు చదువుకోలేక పోతున్నారు. బాల్య వివాహాలు కూడా పూర్తిగా పోలేదు.
ఇక పట్టణాల్లో ఉద్యోగం చేసే స్త్రీ వత్తిడితో, ఇంటి పనితో సతమతమవుతోంది. కొంతమంది పురుషుల ఆలోచనల్లో మార్పు వచ్చి, భార్యకు ఇంటి పనిలో సహాయం చేస్తున్నారు. అయినా ఇంకా మారని వారు ఎందరో. ఇక లైంగిక దాడులు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయ్యాయి. ఆడవారికి భద్రత కరువైంది. స్త్రీ అర్ధ రాత్రి పూట ఒంటరిగా వెళ్ళగలిగే రోజు రావాలని బాపూజీ కలలు కన్నాడు. అంత లేకపోయినా, కనీసం పగటిపూట అయినా అవసరమైనప్పుడు, ఆమె ఒంటరిగా క్షేమంగా వెళ్ళగలిగితే చాలు. ఆరోజే మనకు నిజమైన మహిళా దినోత్సవం.
No comments:
Post a Comment