Wednesday, May 25, 2011

జీరో రుపీ నోటు గురించి మీకు తెలుసా

జీరో రూపాయల నోటు ఉందని మీకు తెలుసా? 2007 వ సంవత్సరంలో ఫిఫ్త్ పిల్లర్ అనే స్వచ్చంద సంస్థ ఈ నోటును లంచగొండితనాన్ని నిర్మూలించడానికి తయారు చేసింది. ఇది చూడడానికి అచ్చంగా నిజమైన 50 రూపాయల నోటులాగా ఉంటుంది.

ఫిఫ్త్ పిల్లర్ యొక్క ముఖ్య ఉద్దేశం లంచగొండితనాన్ని నిర్మూలించడం. భారతదేశంలో ఈ సంస్థ యొక్క ముఖ్య కార్యాలయం చెన్నైలో ఉంది.


ఇమేజ్

భారతీయులు ప్రతి సంవత్సరం దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు లంచం రూపంలో చెల్లిస్తున్నారని ఒక అంచనా. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏపని అయినా కావాలంటే లంచం ఇవ్వడం ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. దీనిని అరికట్టాలంటే ఏదో ఒకటి చేయాలని ఫిఫ్త్ పిల్లర్ సంస్థ భావించింది. అందుకే జీరో రూపాయల నోటును తయారు చేసింది.


2007 వ సంవత్సరం నుండి ఇప్పటివరకు 13 లక్షల నోట్లను ఈ సంస్థ పంపిణీ చేసింది. ఈ సంవత్సరంకూడా ఇవి వాడుకలోనే ఉన్నాయి. ఇవి చూడడానికి 50 రూపాయల నోటులాగా ఉన్నప్పటికీ ముందు వైపు మాత్రమే ముద్రించి ఉంటాయి. ఈ నోట్లు హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ముద్రించబడ్డాయి. 

ఫిఫ్త్ పిల్లర్ అధ్యక్షులు శ్రీ విజయ్ ఆనంద్ ఈ నోట్లు అద్భుతంగా పని చేస్తున్నాయని చెప్పారు. దీనికి అయన ఒక ఉదాహరణ ఇచ్చారు. ఈ మధ్య అర్ధరాత్రి పూట ఒక ఆటో డ్రైవర్ ను పోలీస్  పట్టుకున్నప్పుడు అతను లంచంగా ఈ జీరో రూపాయల నోటు ఇచ్చాడట. అప్పుడు ఆ పోలీస్ మొదట షాక్ అయి తర్వాత నవ్వి వదిలివేసాడట. ఈ రకంగా తొందరలోనే లంచగొండులందరిలో మార్పు వస్తుందనే ఆశాభావాన్ని అయన వ్యక్తం చేశారు. 

ఇప్పుడు భారతదేశాన్ని చూసి లంచగొండితనాన్ని నిర్మూలించడానికి  ఇలాంటి విలువలేని నోట్లు ఇచ్చే విధానాన్ని  మెక్సికో, నేపాల్ కూడా అనుసరిస్తున్నాయి.

2 comments: