Tuesday, May 31, 2011

బేకింగ్ సోడా లేక వంట సోడా వల్ల ఉపయోగాలు

బేకింగ్ సోడా లేక వంట సోడాను మనం కేకులు, బజ్జీలు వంటివాటిలో అవి మృదువుగా రావడానికి ఉపయోగిస్తాము. కానీ బేకింగ్ సోడా వల్ల అనేక ఇతర ఉపయోగాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

ఇమేజ్
  • ఫర్నిచర్ మీద పెన్సిల్ గీతలు, క్రేయాన్ లేక ఇంకు మరకలు ఉన్నాయా? అయితే తడిపిన స్పాంజ్ మీద కొంచెం బేకింగ్ సోడా చల్లి దాంతో ఆ మరకల మీద రుద్దండి. 
  • ఒక లీటర్ నీళ్ళలో కొంచెం బేకింగ్ సోడా వేసి ఆ నీటితో ఫ్లాస్క్ ను శుభ్రం చేస్తే దానిలోని వాసనలన్నీ మాయమవుతాయి. 
  • కూరగాయలు లేక పళ్ళ మీద ఉన్న పురుగుల మందుల అవశేషాలు పోయి శుభ్రపడాలంటే కొంచెం బేకింగ్ సోడా వేసిన నీళ్ళతో కడిగితే సరి. 
  • మాంసం వండటానికి ముందు దానికి బేకింగ్ సోడా పట్టించి రెండు లేక మూడు గంటలు ఫ్రిజ్ లో ఉంచి తీయండి. తరువాత దానిని శుభ్రంగా కడిగి వండితే మృదువైన, రుచికరమైన మాంసం తయార్.  
  • తడిపిన స్పాంజ్ మీద కొంచెం బేకింగ్ సోడా చల్లి దాంతో ఫ్రిజ్ ను తుడిస్తే శుభ్రంగా ఉంటుంది. ఒక చిన్నబాక్స్ లో కొంచెం బేకింగ్ సోడాను ఉంచి దాన్ని ఫ్రిజ్ లో ఉంచితే దుర్వాసనలన్ని పోయి చక్కగా ఉంటుంది.
  • చెమటతో శరీరం దుర్వాసన వస్తుంటే చెమట పట్టే ప్రదేశాల్లో కొంచెం బేకింగ్ సోడాను చెల్లితే శరీర దుర్వాసన మాయం.
  • టొమాటో వంటి పుల్లటి సూప్ కు మంచి రుచి రావాలంటే చిటికెడు బేకింగ్ సోడా కలిపితే సరి. 
  • పొట్టలో మంట లేక అనిజీగా ఉన్నప్పుడు కప్పు నీళ్ళలో పావు చెంచా  బేకింగ్ సోడా వేసుకుని తాగితే వెంటనే ఫలితం కనిపిస్తుంది. కానీ ఇది ఎప్పుడన్నా మాత్రమే వాడాలి. తరుచుగా వాడకూడదు.
  • కొంచెం బేకింగ్ సోడాను పేస్టులాగా చేసి దానిని వంటగదిలో గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల జిడ్డుగా ఉన్న చోట రాసి ముందు తడిబట్టతో ఆపై పొడిబట్టతో తుడిస్తే శుభ్రపడుతుంది.
  • కొంచెం వేడి నీళ్ళలో ఒక చెంచా బేకింగ్ సోడా వేసి దానిలో మురికిగా ఉన్న దువ్వెనలు, బ్రష్ లు వేసి, కొంచెంసేపు తర్వాత మంచి నీళ్ళతో కడిగితే మురికి, జిడ్డు మాయమవుతాయి.

No comments:

Post a Comment