Wednesday, March 23, 2011

పదోతరగతి పిల్లలకు చిట్కాలు

రేపటినుండి  పదోతరగతి పిల్లలకు పరీక్షలు.   పిల్లలకు పరీక్షలంటే తల్లితండ్రులకు పరీక్షలే.ఎక్కువ వత్తిడి లేకుండా పిల్లలకు మంచి మార్కులు రావాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి.
అవేంటంటే  

  • జ్ఞానముద్ర  ఏకాగ్రతను పెంచుతుంది. కనుక ప్రొద్దున్నే 5 నిముషాలు జ్ఞానముద్ర వేయించండి. 
  • ప్రాణాయామం వత్తిడిని దూరం చేస్తుంది. 10 నిముషాలు ప్రాణాయామం చేయమనండి. 
  • ముందురోజు నీళ్ళలో నానబెట్టిన బాదంపప్పులు మూడు లేక నాలుగు టిఫిన్తో పాటు ఇవ్వండి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. 
  • ఉపాహారం (బ్రేక్ ఫాస్ట్) గా ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఇడ్లి, దోశ లాంటివి లేక చపాతీ ఇవ్వండి. వీటితోపాటు కొన్ని మొలకెత్తిన పెసలు, శనగలు లేక బఠాణీలు కూడా ఇవ్వండి.
  • పరీక్ష నుండి రాగానే చల్లటి మజ్జిగ, కొబ్బరినీళ్ళు  లేక ఏదైనా పండ్ల రసం ఇవ్వండి. 
తల్లితండ్రులకు సూచనలు:  


  • పిల్లలు చదువుకోవడానికి వీలుగా ప్రశాంత వాతావరణం కల్పించండి.
  • తల్లితండ్రులు కూడా సాధ్యమైనంతవరకు టి.వి.కి దూరంగా ఉంటే మంచిది.
  • పిల్లలు చదువుతున్నది వినటం, వారికి ఏమైనా సహాయం చేయకల్గితే చేయండి. లేకుంటే మీరు కూడా ఏదైనా పుస్తకం చదువుకోండి.
  • తల్లితండ్రులు పిల్లల పరీక్షలప్పుడు వాదులాటలకు దూరంగా ఉండండి.
  • బంధువులు లేక స్నేహితులను  ఇళ్ళకు ఆహ్వానించకుండా ఉంటే మంచిది. కావాలంటే వాళ్ళతో ఫోనులో టచ్ లో ఉండండి.
 విద్యార్ధులకు చక్కగా చదువుకోవడానికి, జ్ఞాపకశక్తికి చిట్కాలు:


  • "షార్ట్ టరం మెమొరీ" ఇది మీకందరికి గజినీ సినిమా వల్ల పరిచయమే. మనం చదివింది వెంటనే వచ్చినట్లు అనిపిస్తుంది. ఇదే షార్ట్ టరం మెమొరీ. ఇది ఎక్కువసేపు గుర్తుండదు. చదివినదానినే రెండు, మూడుసార్లు మననం చేసుకోండి. కంటస్థం చేయండి. 
  • చదివినదానిని చూడకుండా అమ్మ, నాన్నకో, అక్క, అన్నకో చెప్పండి. దీనివల్ల ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవచ్చు. 
  • స్నేహితులు చెప్పారనో, లేకపోతే ఇంకెవరో చెప్పారనో కొత్త పాఠాలు చదవడానికి ప్రయత్నించవద్దు. అంతకుముందు చదివినవే పునశ్చరణ చేసుకోండి.  
  • " యద్భావం తద్భవతి". తప్పకుండా మీరు చదివినవే వస్తాయనే నమ్మకంతో వెళ్ళండి. ఖచ్చితంగా అవే వస్తాయి. 
  • రాత్రిపూట పడుకునే ముందు, ప్రొద్దున్న లేచిన తర్వాత దేవుడిని ఒకసారి స్మరించుకోండి. దైవనామస్మరణ ధైర్యాన్నిపెంచుతుంది. 
  • వత్తిడి మరీ ఎక్కువగా ఉంటే కళ్ళు మూసుకొని మీ వత్తిడి బయటకు పోతున్నట్లుగా భావించండి. 
  • ఆకుపచ్చ రంగు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆకుకూరలు ఎక్కువగా తినండి. బెడ్రూంలో గ్రీన్ నైట్ లాంప్ పెట్టుకోండి.
  • పరీక్షలు జరుగుతున్నన్ని రోజులు అమ్మ పెట్టినదే తినండి. బయట ఏమీ తినవద్దు.
 ఆల్ ది బెస్ట్!

No comments:

Post a Comment