Friday, September 12, 2014

రోటిమాటిక్ - మొట్టమొదటి ఆటోమాటిక్ రోబోట్ రోటీమేకర్

ప్పుడైనా మీకు చపాతీ చేయాలంటే విసుగు అనిపించిందా? పిండి కలపటం, దానిని చపాతీలా వత్తటం, పెనం మీద కాల్చటం,  ఇవి అన్నీ చేసే పని లేకుండా డైరెక్ట్ గా పిండి ఇలా పెట్టగానే చపాతీ అలా వచ్చేస్తే బావుండని అనుకున్నారా? మీరు అనుకున్నారో లేదో కానీ ప్రణతి నాగార్కర్ అనుకుంది. అనుకోవటమే కాదు అలాంటి అవకాశం కోసం వెతికింది. 

అలా వెతికినప్పుడే ఆమెకు అర్ధమైంది. అలాంటివి లేవు అని. అప్పుడు, ఆమె తనే అలాంటి దానిని తయారు చేయాలని అనుకుంది. వెంటనే తన భర్త రిషి ఇస్రానితో కలిసి ప్రయత్నాలు మొదలు పెట్టింది. వీళ్ళిద్దరూ జిమ్ప్లిస్టిక్ సంస్థ సహ వ్యవస్థాపకులు. ఆరేళ్ళ పైన శ్రమించి, వాళ్ళు రోటిమాటిక్ తయారు చేయగలిగారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోమాటిక్ రోబోట్ రోటీమేకర్. ఇప్పటిదాకా మనం చూసిన రోటీమేకర్స్ కు పూర్తిగా భిన్నమైనది. ఇది ప్రత్యేకించి గృహావసరాల కోసమే తయారు చేయబడింది. భారతీయులైన ప్రణతి నాగార్కర్, రిషి ఇస్రానిలు దీనిని తయారు చేయటం మనందరికీ గర్వకారణం.



దీనితో చపాతీ చేయాలంటే మనమేమీ చేయనక్కరలేదు, కావలసిన విధంగా ఆదేశాలు ఇస్తే చాలు. పిండి కలపటం, దానిని చపాతీలా వత్తటం, కాల్చటం అన్నీ అదే చేస్తుంది. ఇది ఒక ట్రిప్ కి 20 చపాతీలు అంటే నిముషానికి ఒకటి చొప్పున తయారు చేస్తుంది.  దీనిలో ఉప్పు, కారం, పసుపు వంటివి లేక ఇంకేమైనా మసాలా దినుసులు కలుపుకోవటానికి, ఆయిల్ వేసుకోవటానికి ఆప్షన్లు ఉన్నాయి. అంతే కాకుండా చపాతీ ఎంత మందం ఉండాలో, ఎలా కాల్చాలో కూడా మనం నిర్ణయించుకొని దాని ప్రకారం దీనికి ఆదేశాలు ఇస్తే సరిపోతుంది. బాగుంది కదా! అయితే ఇది ఇండియాకు రావటానికి ఇంకా టైం పడుతుంది. 


ప్రస్తుతం ప్రణతి వాళ్ళు యూఎస్ సర్టిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. మొట్టమొదట దీని గురించి యూట్యూబ్ లో వీడియో రిలీజ్ చేయగానే, ఆర్డర్ల ప్రవాహం వెల్లువెత్తింది. ముందుగా బుక్ చేసుకున్న యూఎస్ లోని వినియోగదారులకు రోటిమాటిక్ $599కే లభిస్తుందని ప్రకటించటం ఒక కారణమైతే, ఇలాంటి పూర్తి ఆటోమాటిక్ రోటీమేకర్ ఇప్పటిదాకా లేకపోవటం ఇంకో కారణం. అయితే దీని చిల్లర ధర $999గా నిర్ణయించటం జరిగింది. ఇది 2015 లో వాళ్ళు యూఎస్ లోని వినియోగదారులకు అమ్మదల్చుకున్న ధర. వేరే దేశాలలో దీనిని ఎప్పుడు అమ్మటం మొదలు పెడతారో, ఎంతకు అమ్ముతారో ఇంకా తెలియవలసి ఉంది. 

No comments:

Post a Comment