Tuesday, September 16, 2014

ఐదేళ్ళకే ఐదు అడుగుల ఎత్తు

ఐదేళ్ళకే ఐదు అడుగుల ఎత్తు పెరిగిన పిల్లల్ని మీరుప్పుడైనా చూశారా? మీరట్ లోని కరణ్ సింగ్ ఐదేళ్ళకే ఐదడుగుల పైన ఎత్తు పెరిగాడు. కొద్ది రోజుల్లో అతనికి ఆరేళ్ళు నిండబోతున్నాయి. ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుతో అతను గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాడు.

కరణ్ స్కూల్లో చేరిన కొత్తలో అతని దగ్గరకు పిల్లలెవరూ వచ్చేవారు కాదట. కానీ ఇప్పుడతనికి ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. అతనే కాదు, వాళ్ళమ్మ స్వెత్లానా సింగ్ కూడా ఏడడుగుల రెండంగుళాల ఎత్తుతో, అత్యంత పొడవైన భారతీయ మహిళగా గిన్నిస్ బుక్ లో నమోదైంది. 2012 దాకా ఆమెదే రికార్డు. తర్వాత  పశ్చిమబెంగాల్ కు చెందిన సిద్ధికా పర్వీన్ ఎనిమిదడుగుల రెండంగుళాల ఎత్తుతో ఆమె స్థానాన్ని ఆక్రమించింది. 

ఐదేళ్ళకే ఐదు అడుగుల ఎత్తు

ఇమేజ్

విచిత్రమైన విషయమేమిటంటే స్వెత్లానా సింగ్ 25 ఏళ్ల వయసులో కూడా ఎత్తు పెరుగుతూ ఉండటం. ప్రతి రెండు సంవత్సరాలకు నాలుగంగుళాల చొప్పున ఆమె ఎత్తు పెరుగుతూ ఉందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆమె బెంగుళూరులో కాలేజ్ లో చదువుతున్నప్పుడు సంజయ్ అనే అతను ఆమెని ప్రేమించి 2007లో పెళ్లి చేసుకున్నాడు. అతను డైటీషియన్. అతని ఎత్తు ఆరడుగుల ఆరంగుళాలు. 

మీరట్ కి చెందిన డాక్టర్ హరీష్ మోహన్ రస్టోగి 25 ఏళ్ల వయసులో కూడా స్వెత్లానా ఎత్తు పెరుగుతూ ఉండటం ఆశ్చర్యమేనని అంగీకరించాడు. ఈయన మానవ పెరుగుదల మీద అధ్యయనం చేస్తున్నాడు. సహజంగా ఎఫిఫైసిస్ అంటే ఎముకల పెరుగుదలకు దోహదం చేసే ప్రక్రియ 21 ఏళ్ల వయసుకి ఆగిపోతుందని, కానీ కొంతమందిలో గ్రోత్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్  అవటం వలన వాళ్ళు 25 ఏళ్ల వయసు వరకు ఎత్తు పెరుగుతూ ఉంటారని ఈ డాక్టరుగారు అంటున్నారు. స్వెత్లానా సింగ్, ఆమె కొడుకు కరణ్ సింగ్ అత్యద్భుతమైన వినికిడి శక్తి కలవారని, ఎంత దూరం నుండైనా శబ్దాలను వినగలరని ఆమె భర్త సంజయ్ చెప్తున్నాడు.

No comments:

Post a Comment