Wednesday, September 17, 2014

అసహ్యం కలిగిస్తున్న అసభ్య టివి ప్రోగ్రామ్స్

టివి ఛానెల్స్ లో ఈమధ్య వస్తున్న కొన్ని ప్రోగ్రామ్స్ మరీ దారుణంగా ఉంటున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసింది జెమినీ ఛానెల్లో వస్తున్న అంతఃపురం గురించి. దీని ద్వారా వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారో అర్ధం కావటం లేదు. ఈప్రోగ్రాం గురించి చాలా మంది ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా తిడుతూ రాయటం నేను ఎన్నో మ్యాగజైన్స్ లోనూ, అంతర్జాలంలోనూ చదివాను. 

టిఆర్పి రేట్ పెంచుకోవాలంటే ఎన్నో మంచి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయవచ్చు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రసారం చేయాలనుకుంటే దాని కోసం ప్రత్యేకంగా ఛానెల్ ఏర్పాటు చేసుకొని దాంట్లో వేసుకోవచ్చుకదా. కానీ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా పిల్లలతో కలిసి చూడడానికి వీల్లేనంత చెత్తగా దీన్ని రూపొందించిన వాళ్ళను అనుకోవాలి. కుటుంబ సభ్యులంతా కలిసి టివి చూసే ప్రైమ్ టైంలో ఇలాంటి వాటిని ప్రసారం చేయటంలో వాళ్ళ ఉద్దేశ్యమేంటో. ఇప్పటికే దాదాపు అన్ని ఛానెల్స్ లో వచ్చే కొన్ని పనికిమాలిన సీరియల్స్ తో, చిన్నపిల్లలతో సహా చాలామంది మనసులను కలుషితం చేస్తున్నారు. 

ఈ ప్రోగ్రాం అనే కాదు. ఇలాంటివి ఇంకా ఉన్నాయి. ఈటివిలో వస్తున్న జబర్దస్త్ కామెడీషో  వెకిలి కామెడీకి ప్రతిరూపమయ్యింది. అసభ్యకరమైన డైలాగులతో, వెకిలిగా ఆడ వేషం వేసుకుని పాత్రలు ఒకరినొకరు కొట్టుకోకుండా ఈప్రోగ్రాం ఉండదు. ఎంతోమంది తిడుతూ రాసిన తర్వాత ఇప్పుడు వెనుకటి కంటే కొంత నయమయినప్పటికీ, ఇంకా చెప్పుకోదగ్గ గొప్పగా ఏమీ ఉండదు. ఇక తడాఖా షో మొదట్లో బాగుండేది. రాను రానూ, దీనిలో కూడా జబర్దస్త్ తరహా వెకిలితనం మొదలైంది. ఇక్కడ రెండు ఛానెల్స్ లో వచ్చే రెండు, మూడు ప్రోగ్రామ్స్ గురించే రాసినంత మాత్రాన మిగిలిన ఛానెల్స్ లో వచ్చేవన్నీ గొప్పవని కాదు. ఎక్కువమంది చూస్తున్న తెలుగు ఛానెల్స్ లో ఈ రెండూ  చెప్పుకోదగ్గవి కనుక వీటి గురించి రాయటం జరిగింది. ఇవి  రెండూ మచ్చుకు మాత్రమే. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంకో విషయమేమిటంటే చెత్త ప్రోగ్రామ్స్ అని తెలిసీ, వాటిలో పాల్గొనే ప్రేక్షకుల గురించి చెప్పటం వలన ఉపయోగం లేదు కనుక అలాంటి వాటి గురించి ప్రస్తావించలేదు. ఇంక కొన్ని ప్రోగ్రామ్స్ లో యాంకర్ల వస్త్రధారణ ఎంత ఘోరంగా ఉంటున్నదంటే వాళ్ళ కంటే ఐటెం డాన్సర్స్ బట్టలు నయమనిపిస్తాయి.  

అసలు ప్రోగ్రామ్స్ డిజైన్ చేయటం రాదా లేక అలా చేస్తేనే జనాలు చూస్తారని వీళ్ళ ఉద్దేశ్యమో అర్ధం కావటం లేదు. కొన్ని న్యూస్ ఛానెల్స్ ప్రారంభంలో అసభ్యకరమైన వార్తలు చూపించే పాపులర్ అయ్యాయని కొంతమంది అంటారు. అయితే ఇలాంటి అడ్డదోవల్లో వచ్చే పాపులారిటీ ఎంతకాలం నిలుస్తుందో వారికి తెలియనిదేమీ కాదు. అయినా సరే, గడిచినంత కాలం పబ్బం గడుపుకుందామనే తప్ప వేరే ధ్యాస లేదు. మీడియా ఎంత బాధ్యతగా ఉండాలి? ఇప్పటికే, పెరిగిన టెక్నాలజీని సరిగా వాడుకోలేని కారణంగా పిల్లల్ని పెంచటం ఎంతో కష్టంగా మారింది. ఎదిగే పిల్లల మనసుల్లో చెడు భావాలు నాటితే, దాని కారణంగా జరిగే పరిణామాలకు, నేరాలకు ఎవరు బాధ్యత వహిస్తారు?

ప్రజలను ఆకట్టుకోవటానికి ఎలాంటి ప్రోగ్రామ్స్ రూపొందించాలో కొంచెం శ్రద్ధగా ఆలోచిస్తే అర్ధం అవుతుంది. ఒక రైటర్ గా నాకే ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. అలాంటిది హేమాహేమీలు వారికి తెలియదా? కనీసం ఇక నుండైనా వాళ్ళ చేతిలోని పదునైన ఆయుధాన్ని సమాజమేలు కోసం ఉపయోగిస్తే బావుంటుంది. అది చేత కాకపోతే, ఊరుకున్నా ఫరవాలేదు కానీ ఆ ఆయుధంతో అమాయకులని చంపవద్దని మనవి. 

4 comments:

  1. Amma....telugu vhannellu ..vekili programs ani gonthu chinchukuni....cheyyi neppekkelaa raasi raasi inka emcheyyalo teliyaka evariki cheppukovalo teliyaka........Maa intlo cable cut chesesa....
    tharavatha emjarigindo cheppataanikinsiggesthondi.

    ReplyDelete
  2. అయామ్ సారీ jvrao గారు, మీ పరిస్థితి అర్ధమయ్యింది. రాను, రానూ విలువలు తగ్గిపోతున్నాయి. ఇది అన్ని రంగాల్లో చూస్తున్నదే. టివి ప్రోగ్రామ్స్ చెత్తగా ఉండటం చాలా కాలం నుండి ఉన్నదే కానీ, మరీ ఇంత అసహ్యకరమైన ప్రోగ్రాంని మంచి పేరున్న జెమినీ ఛానెల్ నుండి అసలు ఊహించలేదు. అందుకే బాధతో రాయటం జరిగింది, కానీ దీని వల్ల ఏదో మార్పు వస్తుందని మాత్రం అనుకోవటం లేదు. ఎందుకంటే మీలాంటి వారెంతోమంది ఎంతో కృషి చేస్తేనే ఆగలేదు. ఏ విషయమైనా మనుష్యుల్లో చైతన్యం వచ్చినప్పుడే మార్పు అనేది వస్తుంది.

    ReplyDelete