Tuesday, September 23, 2014

విజయవాడలో భగ్గుమంటున్న భూముల ధరలు

ఏపిలో రాజధాని విషయం పూర్తిగా నిర్ణయం జరగకముందే విజయవాడలో ఆకాశానికి చేరుకున్న భూముల ధరలు, రాజధాని విజయవాడే అనగానే చుక్కలని తాకటం మొదలు పెట్టాయి. కేవలం విజయవాడలోనే కాకుండా, విజయవాడకు 70 కిలోమీటర్ల దూరం ఉన్న పల్లెటూళ్ళలో కూడా గజం మూడు, నాలుగు వేలకు తక్కువ లేదు. ఇక విజయవాడకు 30, 40 కిలోమీటర్ల దూరం ఉంటే రేటు ఆరేడువేల పైమాటే. 



విజయవాడలో భగ్గుమంటున్న భూముల ధరలు
ఇమేజ్

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఇవి అన్నీ కూడా పంచాయత్ లేఅవుట్లే. ఉడా లేఅవుట్ కావాలంటే ఇంకా ఎక్కువ కట్టాలి. పోనీ డాకుమెంట్స్ సరిగ్గా ఉంటాయా అంటే అదీ లేదు. ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు. పంచాయత్ లేఅవుట్లకు కన్వర్షన్ సర్టిఫికేట్ ఉండదు, లేకపోతే అఫీషియల్ పంచాయత్ లేఅవుట్ సీల్ ఉండదు. అదే ఉడా లేఅవుట్లకు అయితే ఎల్పీ నెంబర్ ఉండదు. కొంతమంది 'మేధావులు' రెండు మూడు లేఅవుట్లు వేసి, మొదటి దానికి వచ్చిన ఎల్పీ నెంబర్నే వేరేవాటికి కూడా చూపించి అమ్ముతున్నారు. కొనేవాళ్ళు ఆత్రుతలో ఏదీ సరిగ్గా చూసుకోరు. తర్వాత సమస్య వస్తే లబోదిబోమంటున్నారు. ఎవరైనా గమనించి అడిగితే, "అప్లై చేశాము, రావటానికి టైం పడుతుంది, అప్పటిదాకా ఈరేటు ఉండదు, రేటు పెరుగుతుంది" అని తొందర పెడతారు. నిజంగా ఎవరూ కొనకపోతే రేట్లు ఎలా పెరగుతాయి?

డబ్బులు ఉన్నవాళ్ళు కొన్నారంటే వాళ్ళు ఒకదాంట్లో నష్టపోయినా వేరే దాంట్లో కవర్ చేసుకుంటారు. అయినా వాళ్ళు నష్టపోరు. అవసరమైతే  తీసుకున్న అప్పులు ఎలా ఎగ్గొట్టాలో, అదీ కాకపోతే వేరేవాళ్ళకు ఎలా అంటకట్టాలో వాళ్ళకు బాగా తెలుసు. లేకపోయినా, వాళ్ళకు పుష్కలమైన డబ్బు ఉంటుంది కనుక పోయినా పెద్దగా బాధపడరు. కానీ తోటివాడు తొడ కోసుకుంటే, మెడ కోసుకోకపోతే ఎలా అనే మధ్యతరగతివాళ్ళ పరిస్థితి ఏమిటి? ధనవంతులకు కనీసం డబ్బు కట్టలేదని నోటీస్ కూడా పంపించటానికి జంకే బ్యాంకువాళ్ళు మధ్యతరగతివాళ్ళ ఆస్తులను జప్తు చేయటానికి ముందుంటారు. అలాంటప్పుడు, ఆస్తులు కొనేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? రియల్ఎస్టేట్ వాళ్ళ మాయమాటలకు పడిపోతే నష్టం ఎవరికి? ఆలోచించుకోవాలి. సాధారణంగా ధర పెరిగితే, డిమాండ్ తగ్గుతుంది. అయితే ఇక్కడ ధర పెరిగినప్పుడు, డిమాండ్ తగ్గకపోగా పెరుగుతోంది, ఇది స్పెక్యులేషన్ వల్ల అనే విషయం అందరికీ తెలుసు. 

హైదరాబాద్లో ఒకప్పుడు రియల్ఎస్టేట్ బూమ్ బాగా ఉన్నప్పుడు, డాకుమెంట్స్ సరిగా చూసుకోకుండా కొన్నవాళ్ళు తర్వాత ఎంత బాధ పడ్డారో చాలామందికి తెలుసు. అయినా మళ్ళీ అదే తప్పు విజయవాడలో చేస్తున్నారు. రాజధాని అయినంత మాత్రాన రాత్రికి రాత్రే విజయవాడలో కొత్త సౌకర్యాలు వస్తాయా? హైదరాబాద్లో అన్ని డెవలప్ మెంట్స్ రాత్రికి రాత్రే వచ్చాయా? విజయవాడకు ఎంతో దూరంలో ఉన్న మారుమూల పల్లెటూళ్ళలో అభివృద్ది వెంటనే ఎలా జరుగుతుంది? మౌలిక వసతుల అభివృద్ది జరగాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈవిషయం అర్ధం కాక కాదు. కానీ చాలామంది రియల్ఎస్టేట్ వ్యాపారుల మాయాజాలానికి లొంగిపోతున్నారు. మీరు పెట్టిన పెట్టుబడి సంవత్సరంలో రెట్టింపు అవుతుందని చెప్పేవాళ్ళు కొందరైతే, కొందరు 6 నెలల్లో, ఇంకొంతమంది ఇంకో అడుగు ముందుకేసి 3 నెలల్లోనే వస్తుందని చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళని సరిగా ప్రశ్నిస్తే, జవాబు చెప్పలేక నీళ్ళు నములుతారు. 

దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. మాకు తెలిసిన వాళ్ళకు విజయవాడకు కొంచెం దూరంలో ఉన్న ఒక పల్లెటూర్లో స్థలం ఉంది. రేట్లు బాగా ఉన్నాయి కదా అమ్ముదామని రియల్ఎస్టేట్ వాళ్ళని పిలిచి ఆఊరి పేరు చెప్పి, అక్కడ రేట్లు ఎలా ఉన్నాయని అడగ్గానే, కొనటానికి అడుగుతున్నారనుకొని "అబ్బో, అక్కడ నాలుగువేల పైమాటే. మీరు స్థలం తీసుకుంటే 6 నెలల్లో రెట్టింపు అవుతుంది" అన్నారట. వెంటనే ఆయన "అయితే అక్కడ మాస్థలం ఉంది, తీసుకోండి" అనగానే ఖంగు తిని, "అబ్బే, ఆరేటు ఇప్పుడు కాదు సార్, 6 నెలల తర్వాత" అన్నాట. అప్పుడు ఆయన వాళ్ళకు బాగా గడ్డి పెట్టి, "ఎందుకయ్యా జనాలను మోసం చేస్తారు? 6 నెలల్లో రెట్టింపు అయితే మీరే  6 నెలలు ఉంచుకొని, రెట్టింపు చేసుకోవచ్చుగా" అన్నాట. అలా అడిగే వాళ్ళను వ్యాపారస్తులు అవాయిడ్ చేస్తారు, వాళ్ళకు అమాయకులు దొరక్కపోతే కదా! భూముల మీద పెట్టిన పెట్టుబడి వృధా కాదని చాలామంది అంటారు. అది నిజమే కానీ, ఆ పెట్టుబడి సరైనదవ్వాలి కదా! లేకపోతే, లాభం కంటే నష్టమే ఎక్కువ. మధ్యతరగతివాళ్ళు కొనకపోతే ఏ వ్యాపారానికైనా మనుగడ లేదు. వాళ్ళంతా కలిసి నిలదీస్తే, వ్యాపారస్తులు మోసం చేయటానికి భయపడతారు. కనుక పక్కన వాళ్ళు కొన్నారు, కాబట్టి మనమూ కొనాలని అనుకోకుండా, కొనబోయే ముందు బాగా అలోచించి అడుగేయండి.

1 comment:

  1. "భూముల మీద పెట్టిన పెట్టుబడి వృధా కాదని చాలామంది అంటారు. అది నిజమే కానీ, ఆ పెట్టుబడి సరైనదవ్వాలి కదా! లేకపోతే, లాభం కంటే నష్టమే ఎక్కువ" - బాగా చెప్పారు

    ReplyDelete