Monday, September 8, 2014

రాణి - వాణి

"రాణీ! ఏమి చేస్తున్నావు? మీ ఇంట్లో నుండి ఘుమఘుమలు వస్తున్నాయి" అంటూ లోపలికి వచ్చింది పక్కింటి వాణి. వాళ్ళు ఆ ఇంటిలోకి వచ్చి నెల రోజులయింది. ఇద్దరూ ఇంచుమించు ఒకే వయసు వారు కావటంతో తొందరగానే స్నేహితులయ్యారు. దానికి తోడు వాణి మంచి మాటకారి.


"పనసపొట్టు కూర ఆవ పెట్టి వండుతున్నాను" కావలసిన సామగ్రిని సిద్ధం చేసుకుంటూ అంది రాణి. "అబ్బ! ఆకూరంటే మీ అన్నయ్యకెంత ఇష్టమో చెప్పలేను. చిన్నప్పుడు వాళ్ళ బామ్మ బాగా వండి పెట్టేదట. నన్ను చేయమని ఎప్పుడూ సతాయిస్తుంటారు. నాకేమో రాదాయె. ఇంతకాలానికి నీపుణ్యమా అని మీ అన్నయ్యకి, అదెలా ఉంటుందో రుచి చూసే భాగ్యం మాకూ కలిగింది. దీని గురించి వినటమే కానీ ఎప్పుడూ తినలేదు.... " "సరేలే వాణీ! అదెంత భాగ్యం. నేను చేసి పంపిస్తాలే" వాణి మాటలకు అడ్డం వస్తూ అంది రాణి. అన్నట్లుగానే వాళ్ళ కుటుంబం కోసం కూడా తయారు చేసి పంపించింది.

* * *  
            
"రాణీ! గుత్తి వంకాయ చేస్తున్నావా? ఆరు ఊళ్లకు వస్తోంది వాసన" అంటూ వచ్చింది వాణి. "అవును, బాగానే కనుక్కున్నావు"వంకాయల్లో కారం కూరుతూ అంది. "కిందటిసారి ఆకూర చేసినప్పుడు కొంచెం రుచి చూడమని పంపావు కదా! అదెంత బావుందో. నాకు అంత రుచిగా కుదరదు. ఏమైనా నీ చేయి తగిలితే అమృతమే" వాణి మాటలకు మురిసిపోయింది రాణి. వెంటనే ఫ్రిజ్ తీసి  దాంట్లో నుండి ఇంకొన్నివంకాయలు తీసింది. అది చూసి వాణి నవ్వుకుంటూ "మళ్ళీ వస్తాను రాణీ! పని ఉంది" అంటూ ఇంటివైపు నడిచింది.

* * * 

"అక్కా!" భుజం మీద హఠాత్తుగా చేయి పడేసరికి ఉలిక్కిపడి చూసిన రాణికి చెల్లెలు రమ్య కనిపించింది. "ఏంటే విశేషం? సడన్ గా ఊడిపడ్డావు?" మంచినీళ్ళు రమ్యకిస్తూ అంది రాణి. ఇద్దరూ ఒకే ఊళ్లోనే ఉన్నా చెరో మూల ఉండటం, దానికి తోడు రమ్యకు ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం కావటంతో ఏదో ఒక అకేషన్ లో తప్ప వారిద్దరికీ కలవటం కుదరదు. "ఏముందక్కా! మా మేనేజర్ నిన్నరాత్రి  ఆక్సిడెంట్ లో చనిపోయాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కంపెనీ ఇవాళ సెలవు ఇచ్చింది. ఈయనకేమో ఆఫీసులో మీటింగ్ ఉంది. అందుకే నిన్ను చూసి చాల రోజులయిందని నేను ఒక్కదాన్నే నిన్ను చూద్దామని వచ్చాను" అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ అంది రమ్య.

"ఏమిటి ఏదో స్పెషల్ చేస్తున్నట్లున్నావు? బిర్యానీనా? నేను వస్తానని నీకు ముందే తెలిసిపోయిందా?" నవ్వుతూ అంది రమ్య. ఇంతలో పక్కనున్న మసాలాని చూసి "అదేంటక్కా! అంత మసాలా వేస్తున్నావు? ఎక్కువవదా?" "లేదే! బియ్యం చూశావా ఎన్ని వేశానో" ఆ పక్కనే పెట్టిన బియ్యాన్ని చూపించింది రాణి. "ఓహో! రెండు పూటలకు కలిపి చేస్తున్నావా? ఇన్ని బియ్యం వేశావు?" "లేదు. సగం మనకి, సగం పక్కింటి వాణి వాళ్ళకు" "ఎందుకక్కా? వాళ్ళింట్లో ఇవాళ వంట చేయటానికి ఏమైనా ఇబ్బందా?" "అదేం కాదే! నేనేం చేసినా వాళ్ళకు రుచి చూడటానికి పంపిస్తాను" "రుచి చూడటానికి ఏదో కొంచెం పంపిస్తారు కానీ ఇంత ఏమిటక్కా?" రాణి మాటలకు ఆశ్చర్యంగా అడిగింది రమ్య. "అదంతేలే. వాణికి అంత బాగా చేయటం రాదు. వాళ్ళింట్లో అందరికీ నేను పంపించినవే నచ్చుతాయి" అంటూ అప్పటివరకూ జరుగుతున్న తంతు వివరించింది రాణి. "ఏంటక్కా! ఇదంతా నిజమని నమ్ముతున్నావా? నమ్మి వాళ్ళకు వారంలో దాదాపు మూడు రోజులు నువ్వే చేసి పంపిస్తున్నావా? ఆ వాణి నిన్ను పిచ్చిదాన్ని చేసి బాగా వాడు (ఆడు) కుంటోందని నాకు అనిపిస్తోంది" "లేదే, నాకలా అనిపించటంలేదు" అంటున్న రాణిని జాలిగా చూసి "సరేలే అక్కా! నిజం నిలకడ మీద తెలుస్తుంది. నువ్వన్నదే నిజమైతే నాకూ సంతోషమే. పద బిర్యానీ ఏర్పాట్లు చూద్దాం."

"అమ్మా! ఆకలి వేస్తోంది. ఏం చేశావు?" స్కూల్  నుండి వచ్చిన బాబీ వాణిని అడిగాడు. వాడికి క్వార్టర్లీ పరీక్షలు జరుగుతున్నాయి. అందుకే పరీక్ష అయిపోగానే ఇంటికి వచ్చాడు. మళ్ళీ గంటలో వాడు స్కూల్లో జరిగే స్టడీఅవర్లో ఉండాలి. "కొంచెం సేపు ఆగరా, పక్కింటి రాణి ఆంటీ బిర్యానీ పంపిస్తుంది" "అబ్బా! ఆంటీ ఇచ్చేవరకు ఆగాలా? నువ్వేం చేయలేదా? ఏంటమ్మా, ఈ మధ్య అసలు వంట చేయటమే మానేశావు" కోపంగా అంటూ సోఫాలో కూలబడ్డాడు. ఇంతలో గిన్నెల్లో బిర్యానీ, కూరలు తీసుకుని రాణి వచ్చింది. "అబ్బ థాంక్స్ ఆంటీ, బ్రతికించారు. నేను తిని త్వరగా స్కూల్ కి వెళ్ళాలి" దాదాపు లాక్కున్నంత పని చేశాడు బాబీ. "ఆగరా, ఏంటది?" వాళ్ళమ్మ కోపాన్ని పట్టించుకోకుండా బిర్యానీ తినటం మొదలుపెట్టాడు. "ఏమీ అనుకోకు రాణీ! ఒంట్లో బాగాలేక అన్నం మాత్రం వండి పచ్చడి వేసుకొని తినమన్నాను. తిననని పేచీ పెడుతుంటే, ఇంతలో నువ్వు బిర్యానీ తీసుకు వచ్చావు. అంతే, ఇంకేం లేదు" ఆశ్చర్యంగా చూస్తున్న రాణి, రమ్యలకు చెప్తున్న వాణి వైపు విస్మయంగా చూశాడు బాబీ. ఎందుకంటే వాణి అసలు అన్నమే వండలేదని వాడికి తెలసు. "సరేలే. చిన్న పిల్లాడు కదా" అంటూ రాణి, రమ్యలు తిరిగి వచ్చేశారు.

* * *  
రాణి - వాణి
ఇమేజ్
 

ఆరోజు గోంగూర చేద్దామని అనుకుంది రాణి. చూస్తే ఉల్లిపాయలు లేవు. "ఇప్పుడెట్లా? అయ్యో పొద్దున్న చూసుకుంటే బాగుండేదే. సరే, వాణి వాళ్ళ ఇంట్లో ఉన్నయ్యేమో అడుగుదాం" అంటూ వాణి వాళ్ళ పోర్షన్ వైపు వెళ్ళింది. ఇంట్లోకి వెళ్ళబోతూ తన పేరు వినిపించేసరికి ఆగిపోయింది. వాణి ఫోన్లో ఎవరితోనో "మా పక్కింటి రాణి అని ఒక పిచ్చిది ఉందిలే, నేను వంట చేయవలసిన అవసరం లేదు. నువ్వు బాగా చేస్తావు అని పొగిడితే చాలు, అన్నీ తెఛ్చి ఇస్తుంది" అంటూ పెద్దగా నవ్వుతోంది. దానికి అవతల వాళ్ళు ఏమన్నారో కానీ "ఆ... ఎందుకు చేయటం లేదూ? పొగడటం లేదూ? అలా పని చేయించుకోవటం ఎంత కష్టమో నీకేం తెలుసు... " పక్కన చప్పుడుకు తిరిగి చూస్తే, తన ఇంటి వైపు వెళ్తున్న రాణి కనిపించింది. పొగిడి మొత్తం పనిని తమకు కావలసిన విధంగా చేయించుకునేవాళ్ళు ఉంటారని, ఇలా కూడా మోసం చేయవచ్చని తెల్సుకున్న రాణికి తల తిరిగిపోయింది. చెల్లెలు మాటలు గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

No comments:

Post a Comment