Saturday, September 20, 2014

వర్క్ ఫ్రం హోం నిజంగా వర్కవుతుందా

ఈరోజుల్లో చాలామంది ఇంటి నుండి పని చేయటానికి ఇష్టపడుతున్నారు. పెరుగుతున్న ఇంధనం ధరలు, ట్రాఫిక్ చిక్కులు, పిల్లలను లేదా ఇంట్లో పెద్దవాళ్ళను లేక ఇతరత్రా పనులు చూసుకోవడానికి ఎవరూ లేకపోవటం, ఆఫీసులో పొద్దుటినుండి సాయత్రం వరకు పని చేసినా పెద్దగా పెరగని జీతాలు, లభించని ప్రమోషన్లు, ఒకే రకమైన పని చేయటంతో విసుగు, ఇంకా ఇతర కారణాల వల్ల చాలామంది వర్క్ ఫ్రం హోం ను ఎంపిక చేసుకుంటున్నారు.

వర్క్ ఫ్రం హోం నిజంగా వర్కవుతుందా
ఇమేజ్

ఇంటి నుండి పని చేస్తే మన ఇష్టం వచ్చిన వేళల్లో చేయవచ్చు. చెప్పిన సమయానికి ఆపని పూర్తి చేస్తే చాలు. మన మీద వేరే వారి అజమాయిషీ తక్కువ. వ్యక్తిగత స్వేచ్ఛను కూడా కోల్పోవలసిన అవసరం లేదు. దీనితో పాటు పైన చెప్పిన కష్టాలు పడనక్కరలేదు. అంతేకాక మన నైపుణ్యాలను పెంచుకుంటే, రెండు మూడు రకాల పనులు చేసి, ఎక్కువ డబ్బు కూడా సంపాదించవచ్చు. అందుకే ఇప్పుడు ఎన్నో రకాల ఫ్రీలాన్సింగ్ వర్క్స్ అందుబాటులోకి వచ్చాయి.

అయితే సమస్యల్లా సరి అయిన వర్క్ ని సంపాదించటం, సరి అయిన క్లైంట్ ని గుర్తించటమే. ఇది అనుకున్నంత సులువు కాదు. ఆన్ లైన్లో మనకు తెలియని క్లైంట్స్ తోనే చాలాసార్లు పని చేయవలసి వస్తుంది. విదేశాల్లో ఉండే వాళ్ళతో పని చేయవలసి వస్తే మరీ సమస్య. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు. మొత్తం పని చేయించుకున్నాక, డబ్బులివ్వకపోతే, ఎంతో నష్టపోవలసి వస్తుంది. పని చేయటానికి ముందే డబ్బులివ్వటానికి క్లైంట్స్ ఇష్టపడరు. దీనికి మధ్యే మార్గంగా ఇద్దరికీ అనుకూలమైన కొంత డబ్బుని అడ్వాన్సుగా తీసుకోవచ్చు. లేదా కొంత పని చేసినాక, దానికి తగ్గ డబ్బుని తీసుకొని మిగిలినది కొనసాగించవచ్చు. దీంట్లో రిస్క్ లేదా అంటే ఆ మిగిలిన మొత్తాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టే రిస్క్ ఉంది. మొత్తం పోయేకంటే ఎంతో కొంత రావటమే దీంట్లోని మేలు. ఏ వ్యవహరమైనా నమ్మకంతో జరగక తప్పదు.

అయితే డబ్బులు కట్టమనే వాళ్ళని అస్సలు నమ్మవద్దు. అది ఎంత తక్కువ మొత్తమైనా సరే (ఒక్క రూపాయి కూడా) కట్టవద్దు. సరి అయిన క్లైంట్స్ ఎవ్వరూ డబ్బులు కట్టమని అడగరు. వాళ్ళకు పనిచేసే వాళ్ళు కావాలి. పని చేసే వాళ్ళకు డబ్బులు కావాలి. ఇద్దరికీ ఒకరితో ఒకరికి అవసరం ఉంది, ఇంక డబ్బులు ఎందుకు కట్టాలి? కొంతమంది ఏవో అర్ధం పర్ధం లేని కారణాలు చెప్పి, దానికోసం డబ్బులు కట్టమంటారు. అలాంటివి నమ్మకండి. నిజంగా ఎలాంటి మోసం లేని, నమ్మదగిన పనుల్లో డబ్బులు కట్టమనటం ఉండదు. 

డబ్బు దగ్గర తెలిసిన వాళ్ళే మోసం చేస్తుంటే, తెలియని వాళ్ళను ఎలా నమ్మటం? ఇది చాలా కష్టమైన విషయం. దీని కోసం ఈలాన్స్ లాంటి 'ఎస్క్రో' సర్వీసులు వచ్చాయి. క్లైంట్స్ వీళ్ళ వద్ద డబ్బుని డిపాజిట్ చేస్తారు. వాళ్ళు అడిగిన పనిని ఫ్రీలాన్సర్స్ క్లైంట్స్ కోరిక మేరకు పూర్తి చేయగానే వారి అకౌంట్లోకి ఈడబ్బు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ ఫ్రీలాన్సర్ చేసిన పని  క్లైంట్స్ కు నచ్చకపోతే? దాని కోసం 'డిస్పూట్ అసిస్టన్స్' కూడా ఈలాన్స్ అందిస్తుంది. ఇద్దరికీ అనుకూలంగా రాజీ చేయటానికి ప్రయత్నిస్తుంది. అయితే దీనికోసం వాళ్ళకు కొంత ఫీజు చెల్లించాలి. లేదంటే వాళ్ళసైట్ లో ప్రీమియం మెంబర్షిప్ తీసుకోవాలి. ఈ సేవలందించినందుకు గాను క్లైంట్స్ నుండి 8. 75% సర్వీస్ ఫీజు కూడా వసూలు చేస్తుంది. అయితే ఇవి వాళ్ళ వెబ్ సైట్లో పెట్టిన వర్క్స్ కి మాత్రమే వర్తిస్తాయి. ప్రాధమిక స్థాయిలో ఇలాంటి వెబ్ సైట్స్ తో పని చేస్తే మనకు కొంత అనుభవం వస్తుంది. బయట వేరే  క్లైంట్స్ తో డీల్ చేయవలసి వస్తే మనకు తోచిన మేరకు చేసుకోవలసిందే తప్ప వారేమీ సహాయం చేయలేరు.

చాలాసార్లు మనం పెద్ద కంపెనీలు మోసం చేయవని అనుకుంటాము. ఇది కొంతమటుకు నిజమేమో కానీ అన్ని వేళలా వాస్తవం కాదు. నాలుగేళ్ళ క్రితం నేను ఒక పేరున్న యుఎస్ కంపెనీకి ఘోస్ట్ రైటర్ గా సుమారు 6, 7 నెలలు పని చేశాను. ఆకంపెనీ సిఇఓ క్రిస్టీ మొదట రెండునెలలు చేసిన పనికి డబ్బులు ఇచ్చింది. తర్వాత ఆమె, తనకు ఆరోగ్య సమస్యలున్నాయి కనుక డబ్బులు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయని, కొంచెం టైమిస్తే ఒకేసారి పంపిస్తానని చెప్పింది. ఆ మాటలు నమ్మి, మానవతా దృక్పథంతో సరేననటమే నేను చేసిన తప్పు. 

ఇంకో నాలుగైదునెలల తర్వాత, నాకు ఇవ్వవలసిన డబ్బు ఒక పెద్ద మొత్తం అవ్వగానే నేను డబ్బులివ్వమని అడిగాను. అంతే సమాధానాలు ఇవ్వటం మానేసింది. పోనీ నేను రాసిన ఆర్టికల్స్ వాడుకోలేదా అంటే, అవి అప్పటికే తన పేరుతో ప్రచురించుకుంది. ఆ తర్వాత ఇవ్వదని అర్ధం అయినా, కష్టపడ్డ డబ్బుని వదులుకోలేక ఎన్నో మెయిల్స్ పెట్టాను. సమాధానం లేదు, డబ్బూ ఇవ్వలేదు. ఆ సంస్థ పేరు ఇస్తున్నాను. ఎవరైనా పని చేస్తుంటే జాగ్రత్తగా ఉండండి. అది "Kristi Ambrose Marketing & Content Solutions".  

నేను ఎంతో మంది డైరెక్ట్ క్లైంట్స్ తో పని చేశాను. వాళ్ళంతా వ్యక్తులే. సంస్థలు కాదు, అయినా డబ్బు విషయంలో మోసపోలేదు. కానీ పెద్ద సంస్థ అని నమ్మటంతో మోసపోవటం జరిగింది. బాధాకరమైన విషయమేమంటే, ఆమె ఫోన్ నెంబర్, అడ్రెస్, మెయిల్, డబ్బులివ్వలేదనే సాక్ష్యం అన్నీ ఉన్నా కూడా, నేను ఆమెని ఏమీ చేయలేక పోయాను.

మనం గమనించవలసింది ఏమిటంటే రెగ్యులర్ గా ఒకళ్లతోనే పని చేయటం కుదరకపోవచ్చు. చాలాసార్లు కొత్తవాళ్ళతోనే  పని చేయవలసి రావచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో నమ్మకంతో వదిలేయటం తప్ప ఏమీ చేయలేము. ఇలాంటప్పుడు చిన్న అమౌంట్స్ వచ్చే పనులు తీసుకొంటే మంచిది. అప్పుడు పోయినా పెద్దగా బాధ అనిపించదు. ఇంకో విషయమేమిటంటే, నమ్మదగ్గ పనుల్లో పెద్ద మొత్తాలు ఆశ చూపటం జరగదు. 

కనుక ఎక్కువ డబ్బు వస్తుందని దురాశకి పోకుండా, మన కష్టానికి తగ్గ ప్రతిఫలం మనమే నిర్ణయించుకొని దాని ప్రకారం పోవటం మేలు. ఇది ఎవరికి వారు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవలసిన విషయం. అయితే ఎంత మంచి  క్లైంట్స్ అయినా, ఇంకో పని మొదలు పెట్టటానికంటే ముందు, పూర్తిచేసిన పనికి రావాల్సిన డబ్బుని వెంటనే తీసుకుంటే ఎలాంటి గొడవా ఉండదు. ఒకేసారి పెద్ద మొత్తం వస్తుందని ఆశ పడితే మొదటికే మోసం రావచ్చు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వర్క్ ఫ్రం హోం నిజంగానే వర్కవుతుంది. 

3 comments:

  1. hello mam,i need some onlinework,as am having so much free time these days,can u please provide any online project

    ReplyDelete