Saturday, September 27, 2014

నిదానం నారాయణ

"నిదానమే ప్రధానం" అని ఏ ఘడియలో నారాయణకు వాళ్ళ తాత చెప్పాడో కానీ, అప్పటి నుండి అది తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. అసలు నారాయణ వాళ్ళ కుటుంబంలో అందరూ నిదానమే. అయితే నారాయణ అతి నిదానస్తుడు. వాళ్ళు నడిచినా, నవ్వినా, తిన్నా, అది ఏ పనైనా సరే నిదానంగానే చేస్తారు. వాళ్ళ ఇంటి పేరు నిప్పు అయినప్పటికీ, నిదానమని పెట్టాలని వారి గురించి తెలిసిన వాళ్ళంతా అంటారు.  

ఏ తాతనిదానమే మంచిదని చెప్పాడో, ఆ తాత నిదానం కారణంగానే చనిపోయాడు. అన్నం తింటున్నప్పుడు, ఆయనకు ఎక్కిళ్ళు వస్తుంటే మంచినీళ్ళు తీసుకొని రావటానికి ఇంట్లో వాళ్ళు చేసిన  ఆలస్యం వల్ల చనిపోయాడని కొందరు, కాదు గొంతులో ఏదో ఇరుక్కుంటే దాన్ని నిదానంగా మింగాలని ప్రయత్నించాడని, అందువల్ల అది అడ్డం పడి చనిపోయాడని కొందరు అంటారు. కారణమేది అయినప్పటికీ, వాళ్ళ నిదానం తర్వాత కూడా ఏమాత్రం మారలేదు. ఒక రకంగా అది వాళ్ళ అలవాటైంది. 

 అలాంటి నారాయణకు ఆరోజు పెళ్లి. పెళ్లికూతురు వనజకు ఒకపక్క లోపల భయంగానే ఉంది. కారణం నారాయణ ఇంట్లోని వాళ్ళ నిదానం గురించి వినటమే కాదు, పెళ్లిచూపుల రోజు ప్రత్యక్షంగా చూసింది. ఆరోజు పొద్దున్న ఎనిమిది గంటలకు వచ్చిన వాళ్ళు సాయంత్రం ఆరు గంటలకు వెళ్లారు. వాళ్ళకి తినటానికి ఇచ్చిన స్వీట్, మిక్సర్ తినటానికి సరిగ్గా గంట సమయం తీసుకున్నారు. కాఫీల ప్రహసనం ఇంకో అరగంట నడిచిన తర్వాత వనజను తీసుకు వచ్చారు.

వచ్చిన వాళ్ళు నారాయణతో పాటు, అతని తల్లితండులు, అక్కాబావలు, మధ్యవర్తి. వనజను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మొత్తం ఆరు  ప్రశ్నలు వేశారు. నారాయణ, అతని తల్లి చెరో రెండు ప్రశ్నలు అడిగారు. అక్కా, తండ్రి చెరొకటి అడిగారు. వాళ్ళ బావ ఏమీ అడగలేదు. ఆమె జవాబులు చెప్పటానికి ఎక్కువ సమయం తీసుకోలేదు కానీ వాళ్ళు ఒక్కొక్క ప్రశ్నకు అరగంట చొప్పున మూడు గంటలు తీసుకున్నారు. పోనీ కష్టమైన ప్రశ్నలు అడిగారా అంటే, నువ్వు వంట ఎలా చేస్తావు? నీకు ఇష్టమైన సినిమాలు ఏమిటి? వంటి సాధారణ ప్రశ్నలే. 

ఈ తంతు ముగిసేటప్పటికి భోజనాల సమయం అయింది. అన్నాలు తినమంటే కతికితే అతకదన్నారు. "సరే, మా ఇంట్లో తిందురు, రండి" అని రెండిళ్ళ అవతల ఉన్న వనజ వాళ్ళ బాబాయి ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళు కాళ్ళు కడుక్కొని, తుడుచుకొని, కూర్చోవటానికి సరిగ్గా 45 నిముషాలు పట్టింది. ఈలోపల ఇంట్లో వాళ్ళు గబ గబా విస్తర్లు వేసి భోజనాలు వడ్డించారు. వాళ్ళతో పాటు వనజ వాళ్ళ బాబాయిని కూడా కూర్చోమని మరీ మరీ బలవంతం చేస్తే వాళ్ళ సంగతి తెలియక వనజ వాళ్ళ బాబాయి, అతని కొడుకు మధు కూడా భోజనాలకు కూర్చున్నారు. వాళ్ళిద్దరూ పావుగంటలో భోజనం ముగించి, లేవటం బాగుండదు కాబట్టి అలాగే కూర్చున్నారు. అప్పటికి నారాయణ కుటుంబం కూరతో తినటం ముగించి, పప్పు కలుపుతున్నారు. ఎవ్వరూ మాట్లాడకుండా, 32 సార్లే నమిలారో, 64 సార్లే నమిలారో తెలియదు కానీ ఒకో ముద్దా నోట్లో పెట్టుకొని మింగటానికి కనీసం నాలుగు నిముషాలు తీసుకుంటున్నారు. నారాయణ అయితే 6నిముషాలకు ఒక ముద్ద మింగుతున్నాడు. మధు వాచ్ చూస్తూ లెక్కపెట్టాడు కూడా. ఎవరైనా మాట్లాడబోతుంటే  చేతితో వారించారు. తినేటప్పుడు మాట్లాడరట. గంటంబావు తర్వాత నారాయణ తప్ప మిగిలిన వాళ్ళు తిన్నారు. ఇంచుమించు రెండుగంటలకు నారాయణ తినటం పూర్తి అయింది. ఈలోపు మిగిలిన వాళ్ళ చేతులు ఎండిపోయాయి. అంత సేపు ఎవ్వరూ మాట్లాడక పోవటం వల్ల, అక్కడ అంతమంది జనాలు ఉన్నా ఒక రకమైన శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. అందరి భోజనాలు అయినాక, వాళ్ళు చేతులు కడుక్కొని, రెండిళ్ళ అవతలికి నడచి వచ్చి కూర్చునేటప్పటికి ఐదు అయింది. వాళ్ళ సంగతి అప్పటికే అందరికీ అర్ధం అవటం వల్ల టీలు తాగి వెళ్ళమని అనలేదు. ఆ తర్వాత వాళ్ళు అందరికీ చెప్పి కారులో కూచుని బయలుదేరటానికి ఇంకో గంట తీసుకున్నారు. 

వాళ్ళు వెళ్ళిన తర్వాత వనజ ఆ పెళ్లి చేసుకోనని ఏడుపు మొదలు పెట్టింది. కారణమేమిటంటే పెళ్లివారు సుముఖంగానే వెళ్లారు. కట్నం అవసరం లేదని ముందే చెప్పారు కూడా. అయితే వనజ అమ్మా నాన్నలు ఆమెని ఒప్పించారు. వనజ ఇంటికి పెద్దపిల్ల. తన తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. ఇంక నిదానమనే వంక తీసివేస్తే, నారాయణ కుటుంబం గురించి ఎవ్వరూ చెడుగా చెప్పలేదు. అతనికి ఎలాంటి దురలవాట్లూ లేవని వాళ్ళు చేసిన ఎంక్వైరీలో తెలిసింది. నారాయణ చూడటానికి బాగానే ఉంటాడు. మంచి ఉద్యోగం, స్వంత ఇల్లూ ఉన్నాయి. ఆ తర్వాత నాలుగు నెలలకు నారాయణ వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ముహూర్తాలు పెట్టుకుందామని చెప్పింది. అలా ఒక సంవత్సరం తర్వాత వాళ్ళ పెళ్లి ఆరోజు జరగబోతోంది.                                   (ఇంకా ఉంది)

No comments:

Post a Comment