Sunday, April 3, 2011

ఉగాది నాడు చేయవలసిన తొమ్మిది పనులు

ఉగాది ఎందుకు జరుపుకుంటారో, దాని ప్రత్యేకత ఏమిటో అందరికీ తెలిసిన విషయమే. మన పెద్దలు ఉగాదినాడు విధిగా చేయవలసిన కొన్ని పనులను నిర్దేశించారు. అవి:

  • తలస్నానం:  సూర్యోదయానికంటే ముందు ఒళ్లంతా నువ్వులనూనెతో మర్ధన చేసుకుని తలస్నానం చేయాలి. నువ్వుల నూనె ఆరోగ్యానికి ఎంతో మంచిది. మారుతున్న రుతువుల ప్రభావానికి మన శరీరానికి ఎలాంటి అనారోగ్యం రాకుండా ఈ జాగ్రత్తలు.
  • క్రొత్తబట్టలు కట్టుకోవటం: ఉగాది తెలుగునాట క్రొత్త సంవత్సరం. క్రొత్త సంవత్సరం నాడు క్రొత్త బట్టలు కట్టుకోవటం శుభంగా చెప్తారు. అదీ కాక ప్రతి పండక్కి ఇంటిని శుభ్రంగా అలంకరించుకోవటం,  క్రొత్త బట్టలు కట్టుకోవడం, పిండివంటలు భుజించడం మన ఆనందాన్ని తెలియచేసే మార్గాలు.
  • ఉగాది పచ్చడి తినటం: ఉగాది పచ్చడి ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే.
  • ధ్వజారోహణం:  ఒకప్పుడు ధ్వజారోహణం తప్పక చేసేవారు. కాని ఇప్పుడిది కనుమరుగైంది. ఇంటి ముందు ఒక కర్రను నిలిపి దానిని దవనం, పసుపు, కుంకుమలతో పూజిస్తారు. అలా పూజిస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం. అంతేకాక దవనం శారీరక తాపాన్నుండి ఉపశమనం కలిగిస్తుంది.
  • గొడుగులు, విసనకర్రలు వంటివి సమకూర్చుకోవటం: ఈ రోజు నుండి ఎండల ప్రభావం పెరుగుతుంది. కనుక వాటిని సమకూర్చుకోవటం అవసరమని మన పూర్వీకుల భావన. అంతేకాకుండా వీటిని దానం చేయటం కూడా మంచిదని చెప్పారు.
  • చలివేంద్రాల స్థాపన: ఎండాకాలంలో నీరు ఎంత అవసరమో తెలిసిందే. ఉగాది రోజున చలివేంద్రాల స్థాపన మొదలు పెట్టి రాబోయే నాలుగు నెలలు అవసరంలో ఉన్న వారి దాహార్తి తీర్చటం దీని వెనుక ఉన్న ముఖ్యోద్దేశం.
  • అధికారులను దర్శించుకోవటం: ఒకప్పుడు రాజులను దర్శించుకునేవారు. ఇప్పుడు రాజులు లేరు కనుక అధికారులు లేక పాలకులు వారి స్థానంలోకి వస్తారు. పండుగ రోజున వారి వద్దకు వెళ్లి శుభాకాంక్షలు చెప్తే వారి దృష్టిలో ఉండే అవకాశం ఉంటుందని ఇలా చెప్పారు.
  • పంచాంగ శ్రవణం: పంచాంగ శ్రవణం గురించి అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం యొక్క ఫలితాలు, మంచి చెడ్డలు, రాశి ఫలాలు మొదలైనవాటికి ఉపయోగపడుతుంది.
  • నవరాత్రుల నిర్వహణ: ఒకప్పుడు చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు అంటే శ్రీరామనవమి వరకు నవరాత్రులను  నిర్వహించేవారు. ఇప్పుడు కొన్నిచోట్ల మాత్రమే అలా చేస్తున్నారు. 
ఉగాదినాడు ఉగాది పురస్కారాలు, కవి సమ్మేళనాలు కూడా  సర్వసాధారణంగా జరుగుతాయి.
ఈ పండుగనాడు తినే ఆహారపదార్ధాలలో పచ్చిమామిడికాయ తప్పనిసరిగా ఉండాలని చెప్తారు. 

అందరికీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.   

No comments:

Post a Comment